బీజేపీ ఏర్పడి 46 ఏళ్లైనా మహిళను అధ్యక్షురాలిగా నియమించలేదు: రేవంత్ రెడ్డి

బీజేపీ ఏర్పడి 46 సంవత్సరాలైనప్పటికీ ఇప్పటి వరకు అధ్యక్షురాలిగా మహిళను నియమించలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 1980 ఏప్రిల్ 6న బీజేపీ ఆవిర్భవించిందని, ఇప్పటి వరకు 15 మంది బీజేపీ అధ్యక్షుల నియామకం జరిగిందని అన్నారు. కానీ ఒక్కసారి కూడా మహిళకు అధ్యక్ష పదవి అప్పగించలేదని విమర్శించారు. దీనిని బట్టి బీజేపీకి మహిళల పట్ల ఉన్న గౌరవం, చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు.

ఇందిరాగాంధీ, సోనియా గాంధీ నాయకత్వంలో అతి ఎక్కువ కాలం పనిచేసిన పార్టీ కాంగ్రెస్ మహిళలకు అన్యాయం చేస్తుందా అని ప్రశ్నించారు. ముందు బీజేపీకి మహిళను అధ్యక్షురాలిగా నియమించిన తర్వాత బండి సంజయ్ మహిళలకు న్యాయం చేయడం గురించి మాట్లాడాలని సూచించారు. బండి సంజయ్ వ్యాఖ్యలు దక్షిణాది రాష్ట్రాలలోని ఎస్సీ, ఎస్టీ, మహిళలకు వ్యతిరేకమని విమర్శించారు.

తమ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తెలంగాణను సాధించారని, ఇప్పుడు నియోజకర్గాల పునర్విభజనపై కూడా పోరాడతారని తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాలతో పాటు చిన్న రాష్ట్రాలను ఏకం చేస్తామని అన్నారు. పార్లమెంటులో బిల్లును ఎలా ఆమోదిస్తారో చూస్తామని సవాల్ చేశారు. 60 ఏళ్లలో మహిళల కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతో చేసిందని అన్నారు. కానీ బీజేపీ మహిళా అధ్యక్షురాలిని కాదు కదా, జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ పదవి కూడా ఇవ్వలేదని విమర్శించారు.

మహిళలను చిన్నచూపు చూడటమే బీజేపీ లక్షణమని, వారు మహిళలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారని ఆరోపించారు. స్వాతంత్రం తెచ్చింది, రాజ్యాంగాన్ని తెచ్చింది, రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ పార్టీయేనని, ఇప్పుడు దేశాన్ని కాపాడుకునే బాధ్యత కూడా కాంగ్రెస్‌దే అన్నారు. యాభై శాతంతో సీట్ల పునర్విభజన జరిగితే కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు మోదీ ఇంటి ముందు బంట్రోతులుగా నిలబడుతారని అన్నారు. నియోజకవర్గాల పునర్విభజనపై అన్ని దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, పంజాబ్ వంటి చిన్న రాష్ట్రాలకు లేఖ రాస్తానని వెల్లడించారు.

Revanth Reddy
BJP
Telangana
Congress Party
Bandi Sanjay
Women President
Political Criticism

More Telugu News